Tuesday, October 13

బంధువులొస్తున్నారు జాగర్త!

దర్శకత్వం: శరత్

మనమెక్కువ కె.విశ్వనాధ్, జంధ్యాల, బాపు, బాలచందర్, మణిరత్నంల సినిమాలు బ్లాగుల్లో తలుచుకుంటూనే ఉంటాము. అందుకే అవి కాక నాకు నచ్చిన సినిమాల గురించి వ్రాయాలనుకుంటున్నాను. ఇంక బంధువులొస్తున్నారు జాగర్త! గురించి.

చిట్టిబాబు(రాజేంద్రప్రసాద్) ఒక అనాధ. పెద్ద కుటుంబంలోనే పుట్టినా తనవాళ్ళందరూ పడవ ప్రమాదంలో చనిపోతారు. ఉన్న ఒక్క తాతయ్యా చనిపోతాడు. అందుకే స్నేహితులన్నా, బంధువులన్నా పిచ్చి. స్నేహితులు తనను ఉపయోగించుకుంటున్నారనే గ్రహింపు లేకుండా అమాయకంగా వాళ్ళు అడిగినవన్నీ చేసిపెడుతుంటాడు. స్నేహితుడు సుధాకర్(శుభలేఖ సుధాకర్) చెప్తున్నా పట్టించుకోడు. అయితే తన ఆఫీసర్‌ని మాత్రం ఎప్పుడూ లీవు అడిగి ఇబ్బంది పెడుతుంటాడు.
ఓ సారి అలా సుధాకర్ బంధువులింట్లో పెళ్ళికి వెళ్ళి అతని బంధువుల
సత్యపై(రజని) మనసు పారేసుకుంటాదు. సత్య(రజని) తల్లిదండ్రులు(సత్యనారాయణ, అన్నపూర్ణ) వాళ్ళకున్న ఆస్తినంతా బంధువలందరికీ సహాయం చేయటానికి కరిగించేస్తారు. ఆస్తులు పోయినా ఇంతకాలం బంధువర్గంలో తెచ్చుకున్న పేరెక్కడపోతుందోనని అప్పులు చేసి మరీ సహాయాలు చేస్తుంటారు. ఈ స్థితి తెచ్చుకున్నందుకు బాధపడుతుంటారు.

అయితే బంధువుల్లో రాబంధువుల్లాంటి రెండు కుటుంబాలు - సుందరమ్మత్త(సుర్యాకాంతం), ఎప్పుడూ భార్య కొంగు పట్టుకుని తిరిగే ఆమె కొడుకు కిష్టిగాడు(సుత్తివేలు), కిష్టిగాది పెళ్ళాం(శ్రీలక్ష్మి) -- సూరయ్య బాబాయ్(కోటా శ్ర్రినివాసరావు), పెళ్ళై సంవత్సరమైనా అత్తింటికి వెళ్ళని అతని కూతురు బేబీ(వై. విజయ).వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా దొరికినకాడికి దోచేస్తుంటారు. వీళ్ళందరూ కొత్తకాపురమెలా ఉందో చూస్తామంటూ చిట్టిబాబు ఇంటికి పండగకి వెళతారు.వీళ్ళకి తోడు బంధుమూర్తి(బ్రహ్మానందం), బీరకాయపీచు సంబంధం ఉన్న మేరీ(కల్పనారాయ్), రావికొండలరావు, అతని భార్య కూడా దాడిచేస్తారు.

అప్పటికే బంధువులంటే మొహం వాచున్న చిట్టిబాబు ఎంతో సంతోషిస్తాడు. బంధువర్గమంతటికీ పెద్దపెద్ద గంగాళాలతో వంటలు వండించేసరికి చిట్టిబాబు అప్పులు మీద అప్పులు చేయవలసి వస్తుంది. ఏకులై వచ్చి మేకులై కూర్చున్న బంధువులను వదిలించుకోటానికి చిట్టిబాబు, తన స్నేహితుడు సుధతో కలిసి ఏం ప్లాన్ వేస్తాడు? చివరికి వాళ్ళకు ఎలా కనువిప్పు కలిగిస్తాడు? అన్నది క్లైమేక్స్.

రాజేంద్రప్రసాద్, సూర్యాకాంతం ఉన్నారు. ఇంకేం. ఎగబడి చూడొచ్చు. అంతేకాదు. మామూలు మధ్యతరగతి కధ..ముమ్మూర్తులా దానికి సరిపోయే సెట్లూ, మాటలూ, బట్టలూ..కొన్నిసార్లు పాత ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌ని మరిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. మొత్తానికి సరదాగా అందరం కూర్చొని చూడగలిగే సినిమా.

Tuesday, October 6

ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణగారి స్టేటస్ రిపోర్ట్ (01/06/2009 నుండి 30/09/2009 వరకు)

ఈ నెల రెండో తారీకున రిలీజ్ చేసిన పేంప్లెట్ ఇది. ఒకవేళ అది పనిచేయకపోతే ఈ లింకును ఉపయోగించండి.

Thursday, August 27

Daughter of keltoum(2001)



అల్జీరియాలో అట్లాస్ పర్వతాలు ఈ సినిమా యొక్క నేపధ్యం. అల్జీరియాలో బెర్బెర్ జాతి ప్రజలు ఉండేవారు. ఆ తరువాత రోమన్లు కొంతకాలం, అరబ్బులు కొంతకాలం వారిని పరిపాలించారు. అరబ్బుల కాలంలో వారిపై ఇస్లాం రుద్దబడటం ప్రారంభమయ్యింది. కానీ బెర్బెర్లు ఇస్లాములోనికి మారకుండా స్వేచ్చాజీవులుగా తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూవచ్చారు. ఆ విధంగా అక్కడ రెండు సంస్కృతుల మద్య వైరుధ్యాలు మొదలయ్యాయి. తరువాత ఫ్రెంచివారు వాళ్ళని పాలించారు. 1962లో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాక ఇస్లాము ఆ దేశమతంగా ప్రకటింపబడింది. అంతేకాదు అరబిక్ భాష జాతీయ భాషగా పేర్కొనబదింది. 1980లో బెర్బెరుల పోరాటం వల్ల వారి అస్థిత్వాన్ని ప్రభుత్వం గుర్తించింది. 2001లో వాళ్ళ భాషైన "tamazight"ను జాతీయ భాషగా అంగీకరించింది. 1990లో అక్కడ అంతర్గత యుద్దం మొదలయ్యింది - మిలిటరీ ప్రభుత్వానికీ మరియూ ముస్లిం తీవ్రవాదులకూ మద్య. ఈ రెండు వర్గాలూ పోటిపడి సామాన్య ప్రజలను చంపేసాయట. ఇప్పుడు అక్కడ కొంచెం ప్రశాంత వాతావరణం చోటుచేసుకుందట.
బెర్బర్లు కొండల్లో నివసిస్తారు. మిగతా జనాభా కోస్తా ప్రాంతాల్లో నివసిస్తారు. ఇప్పుడు జీవనోపాది కోసం చాలా మంది బెర్బర్లు పట్టణాలకి వలస పోతున్నారు.


ఇంక కధ:

స్విట్జర్లాండ్ నుండి రాలియా తన కన్నతల్లిని వెతుక్కుంటూ అల్జీరియాలో కొండలకు వస్తుంది. అదొక ఎడారి ప్రాంతం. బీటలు వారిన భూమి, ఇసుక, దూళి, కొండలు, గుట్టలు, వేడి - చాలా నిర్జీవమైన ప్రాంతం. అక్కడి ఇళ్ళు కొండల్లోనే ఇమిడిపోయి ఉంటాయి. ఆ ప్రాంతం చూస్తేనే దాహం వేస్తుంది.

రాలియా తాత, పిన్ని ఆ ప్రాంతంలానే నిర్జీవంగా ఉంటారు. గుహలాంటి ఇంటిలో ఉంటారు. వాళ్ళకి నీళ్ళు ఉండవు. నీళ్ళు కావాలంటే చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. వంటకు కావలసిన సరుకులు వాళ్ళుండే కొండ క్రింది రోడ్డుపై లారీలో వస్తుంది. వాళ్ళు దిగి మోసుకు రావాలి. దుర్భరమైన జీవితం గడుపుతుంటారు. అయినా రాలియాను చూసి ఎంతో సంతోషిస్తారు. ఆమె తల్లి కెల్తుం పట్నంలో ఉద్యోగం చేస్తుందనీ, ప్రతి శుక్రవారం వచ్చి వెళుతుందనీ చెప్తారు. ఒక రెండు వారాలు ఎదురుచూసి తల్లి రాలేదని పిన్నితో కలిసి రాలియా పట్నానికి బయలుదేరుతుంది.

ఆఖరి ఐదు నిమిషాల వరకూ ఈ ప్రయాణమే. దారిలో భర్త వదిలేసిన ఒకామెను కలవటం, అక్కడి మగవారితో వీళ్ళ చిన్న సైజు పోరాటాలూ చేయటం, ఆ కొత్తామె చనిపోవటం, రాలియాలా తన తండ్రిని వెతుక్కొచ్చిన అమ్మాయిని కలవటం, ఆమె అక్కడి మగవారి బారిన పడటం, రాలియా పిన్నికీ ఒక మూగతనికీ మద్య చిన్న ప్రేమ కధ జరగటం, వాళ్ళ లారీని దారికాచి దోచుకోటానికి ప్రయత్నించిన బీదవాళ్ళకు సహాయం చేయటం, వాళ్ళ దగ్గర బస చేయటం, పగబట్టిన లారి ఓనరునుండి తప్పించుకోవటం - ఇలా ఒక్క నిమిషం కూడా మన దృష్టిని పోనివ్వకుండా ఎంతో ఆసక్తికరంగా మలచారు. ఎంత ఆసక్తికరంగా అంటే తన తల్లిని కలవటం చూపించకుండా ఇవన్నీ చూపిస్తున్నరేంటి అని మనకు అనిపించదు. రాలియాలానే మనం కూడా ఒక తెలియని ప్రాంతంలో ప్రయాణిస్తూ అక్కడి కొత్తదనాన్ని ఆస్వాదిస్తాము, భయపడతాము, కొన్నిసార్లు అసహ్యించుకుంటాము. ఆ సినిమా ఆఖరులో బీచ్ కనిపిస్తే నాకెంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను. అంతలా లీనమైపోయాను.

తనను తల్లి వదిలించేసుకుంది అని తల్లిపై కోపంగా ఉన్న రాలియాకు ఆమె తల్లి ఏమని చెప్తుంది? రాలియా ఆ జవాబుతో సంతృప్తి చెందుతుందా?
ముగింపు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది.


అసంతృప్తి కలిగించినది ఒకే ఒక అంశం. స్విట్జర్‌లాండ్‌లో పెరిగిన రాలియాకు బెర్బరుల భాష ఎలా వచ్చింది అని?

Wednesday, August 26

syrian bride(2004)

దర్శకత్వం: ఎరన్ రిక్లిస్

గోలన్ హైట్స్ అనే ప్రాంతంలో జరిగే పెళ్ళి ఈ చిత్ర కదాన్శం. గోలన్ హైట్స్ ఒకప్పుడు సిరియాలో ఉండేది. 1967లో సిరియాకీ, ఇజ్రాయేల్‌కి జరిగిన యుద్దంలో ఇజ్రాయేల్ గోలన్ హైట్స్‌ను ఆక్రమించుకుంది. ఐతే ఈ గోలన్ హైట్స్‌లో నివసిస్తున్న ఒకప్పటి సిరియన్స్‌కీ, సిరియాలో ఉండే సిరియన్స్‌కీ సంబందబాంధవ్యాలు అలానే కొనసాగుతున్నాయి. పైగా ఇజ్రాయేల్ ఆక్రమిత ప్రాంతమైన గోలన్ హైట్స్‌ను సిరియాలో విలీనం చేయాలని ఇజ్రాయేల్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా అవుతున్నాయి.

ఇంక కధ:
సినిమా అంతా ఒక్క రోజే. మోనా పెళ్ళి పట్ల అనిశ్చితితో, భయంతో ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇంతవరకూ పరిచయంలేని వ్యక్తిని పెళ్ళిచేసుకోవటమే కాక ఇంక ఎప్పటికీ తన తల్లిదండ్రుల వద్దకు రాలేదు( ఒక సారి ఆమె సరిహద్దు దాటి వెళితే ఈ ప్రాంతంలోనికి అడుగుపెట్టకూడదు).

మోనా తండ్రి సిరియాతో గోలన్ హైట్స్‌ని విలీనం చేయమన్న ఉద్యమంలో నాయకుడు. అందుకే ఇజ్రాయేల్ ప్రభుత్వం అతనిని నిర్భందిస్తుంది. కూతురి పెళ్ళి నిమిత్తం విడుదలవుతాడు. ఈ పోరాటంలో పాల్గొన్నందుకు అతను ఊళ్ళో గౌరవం పొందుతాడు.

రష్యన్‌ని పెళ్ళిచేసుకున్నందుకు ఏడు సంవత్సరాలుగా దూరంగా ఉన్న పెద్దకొడుకు తండ్రి ఆమోదం కోసం ఎదురుచూస్తుంటాడు. తండ్రికున్న కోపానికి మతపెద్దల ఆంక్షలు తోడవటంతో వాళ్ళ మద్య మౌనం పెరుగుతుంది. ఆఖరికి అన్ని సినిమాల్లోలానే దగ్గరవుతారనుకోండి.

పెద్దకూతురు అల్మా స్వతంత్ర భావాలు కలది. ఆమె వేషధారణ గురించి భర్త ఎప్పుడూ ఆమెతో గొడవపడుతుంటాడు. తన వైవాహిక జీవితం సంతోషంగా లేనప్పటికీ మోనాను పెళ్ళిచేసుకోమని ప్రోత్సాహిస్తుంటుంది.

పెళ్ళి చేసుకోవటానికి మోనా కుటుంబం అంతా సరిహద్దు ప్రాంతానికి తరలి వెళుతుంది. ఇజ్రాయేల్ ప్రభుత్వం తీసుకున్న క్రొత్త నిర్ణయం ప్రకారం మోనా పాస్పోర్ట్‌పై ఇజ్రాయేల్ స్టాంప్ వేస్తారు. అక్కడ పనిచేసే ఐక్యరాజ్య సమితి ఉద్యోగి సిరియా అధికారుల వద్దకు వెళ్ళి ఆమోద ముద్ర వేయించేస్తే మోనా సిరియాకు వెళ్ళి పెళ్ళిచేసుకోవచ్చు. సిరియా అధికారి "దీనిపై ఇజ్రాయేల్ స్టాంప్ ఉంది. ఆమె సిరియాలోనే ఉంది. ఇజ్రాయేల్‌కు వెళ్ళలేదు అంటాడు(గోలన్ హైట్స్ ఒకప్పటి సిరియా భూభాగం)". ఇజ్రాయేల్ అనుమతి కోసం ఆరునెలలు వేచి చూశాక కూడ పెళ్ళిరోజు ఇలాంటి సమస్య ఎదుర్కోవలసి వచ్చినందుకు సహజంగానే వాళ్ళ సహనం చచ్చిపోతుంది. ఎంతో బ్రతిమిలాడాక ఇజ్రాయేల్ అధికారి ఆ స్టాంప్‌ను కరక్షన్ ఫ్లుయిడ్తో చెరిపేస్తాడు. హమ్మయ్య అని అనుకున్నంతలోనే సిరియా అధికారి అది చూసి ఇలాంటి పాస్పోర్ట్ నేనెప్పుడూ ఆమోదించలేదు అని అంటాడు. "అలాంటి నిర్ణయాలు నేను తీసుకోను. మా ప్రెసిడెంట్ తీసుకుంటాడు" అని చెప్తాడు.

అందరికీ అసహనం, నిరాశ పెరిగిపోతున్న ఆ సమయంలో ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందనేది ముగింపు.

ఇతర భాషా చిత్రాల పట్ల నాకు ఆసక్తి పెరగటానికి కారణం - వాళ్ళ సంస్కృతీ, ఆచారవ్యవహారాలూ, పద్దతులూ, భావాలూ, అనుభవాలూ,బాధలూ తెలుసుకుందామని(వాళ్ళవి వాస్తవానికి దగ్గరగా ఉంటాయి కనుక). దర్శకత్వం, చాయాగ్రహణం, సంగీతం, నటన గురించి కాదు. అందుకే నేను అవేమీ చెప్పలేను. కానీ అందరూ బాగా నటించారు.

అక్కడి ఉద్రిక్త వాతావరణాన్ని, అక్కడి ప్రజల్లో ఆవేదననీ, అక్కడున్న పితృస్వామ్య వ్యవస్థని చాలా subtleగా చిత్రీకరించారు. చాలాచోట్ల మన దేశం గుర్తొస్తుంది.